• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

శ్రీ రామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గంగావతరణం(6)

నీటి ప్రవాహానికి అడ్డువచ్చిన మహామహా వృక్షాలే నేలకొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్నుమహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది. గంగాప్రవాహంలో జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్నుమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశారు. ఎంతో తపస్సు చేయడం వలన మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తిమంతులవుతారు. 

గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జహ్నుమహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి, నా పితృదేవతల కోసం గంగను భూమికి తీసుకువస్తే మీరు త్రాగేశారు, వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగనది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు అన్నాడు. దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమి తెచ్చారు, చెత్తడం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు. 

ఎవరైనా తమకు అపకారం చేస్తే, ఉత్తములకు అపకారం చేసినవారి యెడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు రెండు ఘడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టివాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది.  అని శాస్త్రం అంటొంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరథ నీ కోసం గంగను విడిచిపెట్టెస్తున్నాను అన్నాడు. గంగను తన కుడి చెవిలోనుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు. 

మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు, గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళి గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. గంగ ఆ 60,000 మంది బూడిదకుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికి ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి. 

వెంటనే బ్రహ్మ దేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి, వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు.  

ఈ గంగ దేవలోకంలో మందాకిని అని పేరుతోనూ,భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది, పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీన్ని ఉద్యేశించే గంగకు త్రిపధగ అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడులోకాల్లో ప్రవహించేదని అర్దం. 

శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో మూడుపాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటికి లాధిని, నళిని, పాధిని అని పేర్లు. మూదు పాయలు పశ్చిమదిక్కుకు వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అని ఆ 3 పిలువబడుతున్నాయి. మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి. రామాయణంలో చాలా తక్కువ సంఘటనలకు మాత్రమే ఫలశృతి చెప్పారు వాల్మీకి మహర్షి. 

ఫలశ్రుతి 

ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తలమీద గంగపడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా? అన్న సందేహం లేకుండా మొత్తం కధను మనసులో ఊహించుకుంటారో, అటువంటి వారికి ఇంతకముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలే తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశృతి చెప్పారు.  

ఇటువంటి పరమపవిత్రమైన గంగావతరణాన్ని సోమవారం నాడు పూర్తిచేయడం మరింత పుణ్యప్రదమైనది. 

రామాయణం మనకిస్తున్న సందేశం ఏమిటి? 

ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు భగీరథుడు. తన కోసం కాదు, తన పితృదేవతలను ఉద్దరించడానికి. మనం రామాయణానికి వారసులం, మనం మన తల్లిదండ్రులను నిరంతరం, ముఖ్యంగా పెద్దవయసులో చూసుకోవాలి, వారికి ఆ సమయంలో కావలసినవి ప్రేమలే. వారిని వృద్ధాశ్రమాల్లో పడేయడం, సూటిపోటి మాటలనడం, భారంగా భావించడం లాంటివి చేయకూడదు. కాలక్రమంలో వారు మరణిస్తే వారికి చేసే శ్రాద్ధకర్మ తప్పకుండా ప్రతి సంవత్సరం చేయాలి. అలాగైన మనం వారి జ్ఞాపకాలతో ఒక్క రోజైనా గడుపుతాం. మన తల్లిదండ్రులు, తాతముత్తాతల గురించి ఆ రోజైన మన పిల్లలకు తెలుస్తుంది. 

పర్యావరణాన్ని, ప్రకృతిని, భూమాతను కాపాడుకోవాలి. సాక్షాత్ బ్రహ్మదేవుడే ఈ గంగావతరణంలో చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని భూమాతను భూతాపం నుండి రక్షించాలి. నదులు పవిత్రమైనవి. మనకు తల్లితో సమానం. అందుకే వాటిని కలుషితం చేయకూడదు. హిందూ ధర్మాన్నే ఆచరించండి. " స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ", హిందువుగా జీవించండి. హిందువుగానే మరణించండి.  

ఇందులో అతికొద్ది భాగంతప్ప మిగితాది మొత్తం పూజ్య గురువులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గంగావతరణం ప్రవచనం విని వ్రాసినదే.  

ఇంకా చదవండి »

గంగావతరణం(5)

శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయపర్వతాలకు వెళ్తారు. శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకుని జటజూటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి క్రిందకు పడమని బ్రహ్మదేవుడి ఆజ్ఞ. 

అందుకని గంగ మంచిప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తోంది. క్రింద నిల్చున్న పరశివుడిని చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక, శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు, తాను ఒక్కసారి క్రిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఈ శివుడిని తన ప్రవాహవేగంతో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది. తన ప్రతాపం చూపిద్దాం అని మొసళ్ళతో, తాబేళ్ళతో, ఎండ్రకాయలతో, కప్పలతో పడిపోదామని అని నిశ్చయించుకుంది. 

ఈ విషయం పరమశివుడికి తెలిసింది.  అందరిలోనూ ఆత్మగా ఉన్నది శివుడే. మనం చేసే ప్రతి కర్మకు సాక్షి ఆ పరమశివుడు. మనం ఏదో పని చేసి, అది దేవుడికి తెలియదనుకుంటే అది మన అజ్ఞానమే అవుతుంది. మనం చేసే ప్రతిపని, ఆలోచన, మాట్లాడే ప్రతి మాట కూడా ఆ పరమాత్మకు తెలుస్తాయి. . అలాగే పరమశివునకు గంగ మనసులో ఉన్న భావం అర్ధమైంది. గంగ అహకారాన్ని అణచాలనుకున్నాడు. అందుకే హిమాలయాలంతా పరమపవిత్రమైన తన జటాజూటాన్ని(జడలను) పెద్దగా విస్తరించాడు శివుడు. 

అంతే గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటం లోనికి దూకింది. దూకూతూ నేను శివుడను పాతాళానికి ఈడ్చుకుపోతాననుకుంది. ఒక సంవత్సరం గడిచింది. దేవతలూ, బ్రహ్మ, భగీరథుడు అందరూ గంగ క్రిదకు పడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఎంత కాలం చూసినా ఒక్క చుక్క కూడా క్రిందపడలేదు. 

శివుడు విప్పిన జటాజూటాంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరంపాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా, ఒక్క చెమటచుక్క పరిణామంలో కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ క్రిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. భగీరథుడు వేచిచూసి బ్రహ్మ దేవుడిని అడుగగా, శివుడు గంగ అహకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడని చెప్పాడు.  

మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివా! గంగ రోషం బాగానే ఉంది. నీ
ప్రతాపమూ బాగుంది. ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టాగానే గంగా పెద్దశబ్దం చేసుకుంటూ, మొసళ్ళతో, ఎండ్రకాయలతో, చేపలు, పాములతో సుడులు తిరుగుతూ, మంచి నురుగుతో, ఆ శబ్దం విన్నా, చూసినా భయం వేసేంత ప్రవహంతో గంగ భూమి మీద పడింది.

నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేఇంఛాడు. భగీరథుడు రధాన్ని అనుసరించమని గంగను వెళ్ళమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. గంగ భగీరథుని రధం వెనుకాలే వెళ్ళింది. 

మాంచి ఎండాకాలంలో మనకు త్రాగునీరు రానప్పుడు మన ప్రక్కవీధిలోకి ఒక ప్రభుత్వ ట్యాంకరు వస్తోంది అని తెలియగానే, అన్ని పనులు వదిలేసి జనం నీటి బిందేలు పట్టుకుని ఎలా పరిగెడతారో, అదే విధంగా గంగ భూమి మీదకు పడిందనగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు, ఋషులు, మునులు, మనష్యులు, పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్నవారు, అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగ నీటిని త్రాగడానికి పరుగులుతీస్తున్నారు.  

మహామహా పాతకాలు చేసినవారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపొయి మంచి శరీరాలను పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు.ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేనివారు, ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తలమీద చల్లుకుంటున్నారు. వారు వెంటనే ఊర్ధ్వలోకాలు వెళ్ళీపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం, మంచి శక్తులను పొంది, పవిత్రులై ఆకశంలోకి ఎగిరిపోతున్నారు. 

గంగ ఇంత పవిత్రమైంది ఎందుకు? శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటం నుంచి పడింది. పరమశివుడిని తాకడం వలన గంగ పరమపవిత్రమై, గంగను ఇతర జలాలో స్మరించినంత మాత్రం చేతనే, ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది. 

ముందు భగీరథుడు రథం మీద వెళ్తున్నాడు, ఆయన రథాన్ని గంగ అనుసరిస్తోంది.దేవతలందరూ ఆకాశంలో గంగ ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో, పక్కన ఉన్న నేలను తుంపర్లతో తడుపుకుంటూ ఆయన ఎటు వెళ్తే గంగ అటు వెళ్తోంది.  

ఇలా సాగిపొతున్న గంగ ప్రవాహం శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిగి చుశాడు కాని గంగ కనిపించలేదు. 

ఇంకా చదవండి »

గంగావతరణం(4)

ఈ 60,000 మంది ఈయన మీదకు పరుగేడుతున్నప్పుడు వచ్చిన శబ్దాన్ని ఆయన విన్నారు.వారు భూమికి చేసిన అపరాధానికి క్రోధంతో అప్పటికే ఉన్నారు కపిల మర్షి రూపంలో ఉన్న వాసుదేవుడు. ఆయన ముఖం కోపంతో ఎర్రబడి, హుంకారం చేస్తూ కళ్ళు తెరిచారు. ఈ 60,000 బూడిద కుప్పలుగా మిగిలిపోయారు. మనకు శ్రీ రామాయణం ఇస్తున్న సందేశం ఏమిటి?  భూమాతను ఎవరు అగౌరవపరుస్తారో, భూమికి అపకారం చేస్తారో, కలుషితం చేస్తారో వారు ఈ రోజు కాకపోయిన ఏదో ఒకరోజు శ్రీ మహావిష్ణువు క్రోధానికి గురవుతారు. 

సగరచక్రవర్తి తన 60,000 మంది సగరుల కోసం ఎంతోకాలం ఎదురు చూశాడు. ఎంతకాలానికి రాకపోయే సరికి తన మనుమడు అంశుమంతుడిని పిలిచి, అశ్వం తిరిగి రాకపోతే యజ్ఞం పూర్తవ్వదు. నేను దీక్షలో ఉన్న అందువల్లు ఇక్కడినుండి కదులరాదు. కనుక ఇప్పుడు నువ్వు పాతాళానికి వెళ్ళు. వెళ్ళెటప్పుడు నీకు విరోధులైన వారు ఎదురుపడచ్చు కనుక ఖడ్గాన్ని, దనస్సు, బాణాలను వెంటతీసుకువెళ్ళు. కాని మార్గమధ్యంలో మహాపురుషులు, గురువులు, పుజనీయులు కనిపిస్తే వారికి నమస్కరించి, పూజించు. ఎవరిని పదితే వారిని వేధించకు, అకారణంగా దూషించకు అని చెప్పి పంపించాడు. 

తాను కూడా రసాతాలానికి బయలుదేరాడు. మొదట తూర్పు దిక్కును మోస్తున్న విరూపాక్షానికి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. అది అంశుమంతుడిని ఆశీర్వదించింది. అలాగే దక్షిణం, పడమర, ఉత్తర దిక్కుల భూభాగాన్ని మోస్తున్న మహాపద్మం, సౌమనసం,భధ్రం అనే ఏనుగులకు ప్రదక్షిణం చేసి, నమస్కరించి వాటి ఆశీర్వాదం పొందాడు. ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమం కనిపించింది. దానికి ఒక నమస్కారం చేశాడు. ప్రక్కనే గుర్రం గడ్డి మెస్తూ కనిపించింది. దాని తీసుకువెళ్ళడానికి దగ్గరకు వెళ్ళాగానే అక్కడ తన తండ్రి సమానులైన 60,000మంది సగరుల భస్మరాశులు కనిపించాయి. అయ్యో, నా తండ్రి సొదరులైన 60,000 మంది మహర్షి కోపానికి భస్మైపోయారని వాటిని చూసి భోరున విలపించాడు. 

క్రోధాగ్నికి భస్మైపోయారు కనుక వీరికి ఉత్తమ గతులుండవు. వీరు ఊర్ధ్వలోకాలకు, భూలోకానికి మధ్య అంతరిక్షంలో ఎక్కడో వెళాడుతుంటారు. నా తండ్రి సమానులైన వీరికి ఉత్తమ గతులు కల్పించడం కోసం నేను తర్పణం విడుస్తానని అంశుమంతుడు దగ్గరలో నీరు లేకపోతే చాలా దూరం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. 

అంతలో అంశుమతుడికి మేనమామైన గరుత్మంతుడు కనిపించి, వారిది మామూలు మరణం కాదు, మహాపురుషుడైన కపిల మహర్షి కోపానికి బలైపోయారు. వీరికి మామూలు జలంతో తర్పణాలిస్తే ప్రయోజనం ఉండదు. హిమవంతుడి కూమార్తైన గంగమ్మ యొక్క జలంతో తర్పణలిస్తే తప్ప విముక్తి లభించదు. ఈ 60,000 సగరుల భస్మరాశుల మీది నుండి గంగ ప్రవహించాలి. అప్పుడే వీరికి ఉత్తమ లోకాలు లభిస్తాయి అన్నాడు. 

ఆ మాటలు విని, గుర్రాన్ని తీసుకుని యజ్ఞప్రదేశానికి వచ్చి, సగర చక్రవర్తికి ఈ వార్త చెప్పి, యజ్ఞాన్ని పూర్తిచేశాడు. తన కూమారులకు ముక్తిని కల్పించడానికి సగరచక్రవర్తి చాలా ప్రయత్నం చేశారు కానీ ముసలివారవడం వలన మరణించాడు.  

ఆయన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. తన పితరులకు విముక్తి కల్పించడానికి గంగను తీసుకురావాలనుకున్నాడు, కానీ తపస్సు చేయలేకపోయాడు, సగరులకు ముక్తిని కల్పించలేకపోయాడు, కాలక్రమంలో మరణించాడు. తరువాత దిలీపుడు రాజయ్యాడు. చాలా గొప్పవాడు ఈయన. ఈయన ప్రయత్నం చేశాడు కానీ తపస్సు చేయలేదు, గంగను భూమికి తీసుకురాలేదు. 

దిలీప మహారజు తరువాత భగీరధుడు రాజయ్యాడు. ఆయన రాజువుతూనే తన పితృదేవతలను ఎలా ఘొర నరకాలనుండి ఎలా రక్షించాలి, వారికి ఎలా ముక్తిని కల్పించాలని ఆలోచించి, మహారాజు అవ్వగానే రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి బ్రహ్మదేవుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు. 

ఎలా తపస్సు చేశాడు? రెండు చేతులు పైకెత్తి, తనకు నాలుగు వైపులా అగ్నిహోత్రాలను పెట్టుకుని, కన్నులు మూయకుండా సూర్యుడినే చూస్తూ, నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ, ఇంత బాధ అనుభవిస్తున్నా, తన మనసును, శరీరాన్ని జయించి, వాటి గురించి ఆలోచించకుండా, బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు.  
భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలకు కూడి ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు సంతోషించాను, ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు భగీరథుడు " నా పితృ దేవతలు కపిలమహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమలోకాలు పొందలేరు. అందువల్ల గంగా వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం కలగాలన్నాడు ". వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు. 

నీ రెండవకోరిక ఉందే అది సులువైనది. కాని మొదటి కోరిక, గంగను భూమికి తీసుకురావడం, అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్ధుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు. 

ఎవరి కోసం భగీరథుడు ఇన్నిన్ని సంవత్సరములు, ఇన్ని సార్లు తపస్సు చేస్తున్నాడు. తన కోసం కాదు. తన పితృదేవతలకోసం. మనిషై పుట్టినవాడి కర్తవ్యం ఏమిటి? పితృదేవతలను ఉద్దరించడం, వారికి ఉత్తమ గతులు కల్పించడం. అందుకే భగీరథుడు గంగను భుమికి రావాలని వరం అడిగాడు. తాను వివాహం చేసుకుని సంతానం పొంది పితృ ఋణం తీర్చుకోవడం కూడా పుట్టిన ప్రతి మనిషి కర్తవ్యం. అందుకే తనకు సంతానం కలగాలని కోరుకున్నాడు. 

మనకు రామాయణం నేర్పుతున్నదేమిటి? కోడుకై పుట్టినవాడు తండ్రి దగ్గర ఆస్తులు తీసుకోవాలని ప్రయత్నించడం కాదు. తన తల్లిదండ్రులు బ్రతికున్నతకాలం వారిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాలి. వారు మరణిచాక వారికి ఉత్తమలోకాలను కల్పించేందుకు పిండప్రధానం చేయాలి, తర్పణలివ్వాలి, వారి మరణతిధి రోజున వారికి పితృకర్మ చేయాలి. 

కాని ఈ కాలం వారు చేస్తున్నది, బ్రతికున్నప్పుడే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు, పసివయసు నుండి ఎంతో ప్రేమగా పెంచినా, ముసలివయసు రాగానే తల్లిదండ్రులన చూసూకోవడం మా వల్ల కాదు, వీరితో మేము సర్దుకుని బ్రతకలేమంటూ వారిని తిట్టిపోస్తూ ఇంటిలోనుండి తోసేయడం. బ్రతికిఉండగానే వారిని చంపేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. ఇక వారు చనిపోయాక తర్పణలివ్వడం వృధా ఖర్చుగా భావిస్తున్నారు. రామాయణం చెప్పినవేవి ఆచరించకుండా శ్రీ రాముడి ఆలయలు చుట్టూ తిరుగుతూ, శ్రీ రాముడి దీవెనలు పొందాలని చూడడం మూర్ఖత్వమే అవుతుంది.  

మళ్ళీ భగీరథుడు పరమశివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. కాలి బొటనువేలి చివరి భాగం మీద నిలబడి ఒక్క సంవత్సరం తపస్సు చేశాడు. శివుడు త్వరగా వరాలిస్తాడు. అందుకే ఆయన బోళాశంకరుడు, భక్త వశంకరుడని పేర్లు. ఓం నమః శివాయ. ఆయన ఒక్క సంవత్సరానికే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవ్వగానే నీకే వరం కావాలి అని కూడా అడగలేదు. గంగను నా తలమీద జటాజూటంలో ధరిస్తాను అన్నాడు శివుడు. అడగకుండానే వరలిచ్చాడు శివుడు. 

ఇంకా చదవండి »

గంగావతరణం(3)

ఏదైన దీక్ష తీసుకునే ముందు చేతికి కంకణం కడతారు. అది దీక్ష పూర్తయ్యేవరకు తీయకూడదు. అటువంటి సమయంలో బంధువుల మరణాల కారణంగా వచ్చిన సూతకం ఆ దీక్షపరుడికి ఉండడు. దీక్ష ముగిసిన తరువాత సాధరణంగా సూతకం ఎన్నిరోజులుంటుందో అన్ని రోజులు పాటించాలి. సగరచక్రవర్తి తన 60,000 మంది సగరులను పిలిచి, తాను కంకణం ధరించాడు కనుక యాగం మధ్యలో లేవకూడదని, ఇంద్రుడు తన పదవి కోసం అశ్వాన్ని దొంగిలించుంటాడు. అందువల్ల భూగోళమంతా గాలించమని ఆజ్ఞాపించాడు. అంతా వెతికినా గుర్రం కనపడక తిరిగివచ్చారు సగరులు. భూగోళమంతాట వెతికినా కనపడలేదన్నారు. 

ఇంద్రుడు అశ్వాన్ని పాతాళంలో దాచిఉంటాడని గ్రహించి మీరు 60,000 మంది ఉన్నారు, ఈ భూగోలమంతా మీ 60,000 మంది 60,000 యోజనాలు వెతకండి అన్నాడు సగర చక్రవర్తి. ఎలా వెతుకుతారో తెలుసా? మీకు వజ్రముల వాంటి గోర్లున్నాయి. ఒక్కొక్కరు ఒక్క యోజనం చొప్పున 60,000 యోజనాల భూమినిలో ఉన్న మట్టిని పెకిలించండి, భూమిని నాగళ్ళు పెట్టి తవ్వేయండి, గునపాలతో చీల్చేయండి, పాతాళానికి వెళ్ళి గుర్రాని తీసుకురండి అన్నాడు సగర చక్రవర్తి. 60,000 మంది భూమిని తవ్వడం, చీల్చేయడం మొదలుపెట్టారు. 

ఇది చూసిన దేవతలు పరుగుపరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. ఈ భూగోళమంతా దైవశక్తులు ఉంటాయి. పంచమహాభూతాలు (ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి/పృధ్వీ ) ఉంటాయి.  

చెట్లను ఆకారణంగా నరికేయడం, కుదురుగా ఉండలేక పువ్వులు, మొగ్గలు, ఆకులు తెంపడం, పంచభూతాలకు ఇబ్బంది కలిగించడం అంటే కలుషితం చేయడం వంటివి శాస్త్రం నిషేధించింది ( మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం. భూమిని రోజురోజుకు వెడెక్కిస్తున్నాం, ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేస్తున్నాం, నదులను, గాలిని, ఆకాశాన్ని, భూమిని కలుషితం చేస్తున్నాం. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నాం, ప్రకృతిని దోచేస్తున్నాం, భూతాపాన్ని పెంచేస్తున్నాం). ఇవన్ని దేవతలు అపచారం చేయడమే. అందుకే పర్యావరణాన్ని పరిరక్షించండి. వారు వారి ధర్మాన్ని పాటించడం మరిచిపోయి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళారు. అందుకే 12 మంది ఆదిత్యులు, 11 రుద్రులు, అష్ట (8) వసువులు, 2 అశ్విని దేవతలు వెళ్ళారు. వీరందరూ కలిపి 33. మొత్తం 33 కోట్ల;దేవతాగణాలు సగరులు చేస్తున్న అకృత్యాన్ని సహించలేక పరుగుపరుగున బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు(వాసు దేవుడు) కపిల మహర్షి రూపంలో ఈ భూమండలాన్ని కాపాడుతున్నాడు. వీళ్ళు చేస్తున్న దుష్కృత్యం వలన ఆయన తపిస్తున్నాడు. 

 ఇలాంటి పనులు చేసేవారి ఈరోజు కాకపోయిన ఏదో ఒక రోజు ఆయన ఆగ్రహానికి గురై భస్మం అయిపోతారు, వాళ్ళు అల్పా ఆయువు కలవారు,  పంచభూతముల జోలికి అనవరసంగా వెళ్ళి, వాటికి అపకారం చేసేవారి ఆయుర్దాయం(జీవిత కాలం) క్షీణిస్తుంది . అందువల్ల మీరు ఆవేశపడకండి అని బ్రహ్మదేవుడన్నాడు, దేవతలు తిరిగి వెళ్ళిపోయారు.  వాళ్ళు అవిధంగా తవ్వి లోపలకు వెళ్తుంటే, వారికి అడ్డువచ్చిన పాములను, మనుషులను, అల అడ్డువచ్చిన ప్రతిజీవిని చంపుకుంటూ వెళ్ళారు. మొదట వారు తూర్పు దిక్కుకు వెళ్ళారు. అక్కడ విరూపాక్షం అనే ఏనుగు ఉంది. అది తన కుంభస్థలం మీద తూర్పు దిక్కున ఉన్న భూమండాలాన్ని మోస్తోంది. మన భూమిని అష్టదిగ్గజాలు మోస్తుంటాయని ఋషులు చెప్పారు. అందులో ఒకటి ఈ విరూపాక్షం. దానికి ఒక్కొక్కసారి దాని కుంభస్థలం నొప్పి పెడితే అది ఒకసారి తన కుంభస్థలాన్ని కదుపుతుంది. అప్పుడు తూర్పుదిక్కున భూకంపాలు వస్తాయని రామాయణంలో ఉంది. దాని చుట్టు ప్రదక్షిణం చేసి, నమస్కరించారు.  

దక్షిణ దిక్కుకు వెళ్ళారు. అక్కడ మహాపద్మం అనే ఏనుగు దక్షిణ దిక్కున ఉన్నభూమిని మోస్తోంది. దాని చుట్టు ప్రదక్షిణం చేసి, నమస్కరించారు. అటు తరువాత పడమర దిక్కుకు వచ్చారు. అక్కడ సౌమనసం  అనే ఏనుగు పశ్చిమ దిక్కన గల భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం, నమస్కారం చేశారు. అక్కడి నుండి ఉత్తర దిక్కుకు వెళ్ళారు. భధ్రం అనే ఏనుగు ఉత్తర దిక్కు భూమిని మోస్తొంది. దానికి ప్రదక్షిణం, నమస్కారం సమపించారు. అంటే మనమేం అర్ధం చేసుకోవాలి? ఎంత ముఖ్యమైన పని మీద వెళుతున్నా, పరోపకారం చేసేవారు, నలుగురి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారు, గొప్పవారు, పూజ్యులు, దేవతలు కనిపించగానే ముందు వారికి నమస్కరించాలి. వారి ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళ్ళాలి. 

ఇక వెత్తుక్కుంటూ ఈశాన్య(ఉత్తర-తూర్పు మధ్య ప్రదేశం) దిక్కుకు వెళ్ళారు. అక్కడ తపోవనంలో మహాతేజో మూర్తి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన ప్రక్కనే గుర్రం గడ్డిమేస్తూ కనిపించింది. వాళ్ళనుకున్నారు ఈయనే గుర్రాన్ని అపహరించి ఉంటారు. ఈయనే దొంగ అన్నారు. మనకు రామాయణం ఇస్తూన సందేశం ఏమిటి? ఆధారం లేకుండా ఎవరినిపడితే వారిని, ముఖ్యంగా మహాత్ములను నిందించకూడదు. వారి గురించి లేనిపోని మాటలు మాట్లాడకూడదు. లేనిపోని అభాంఢాలు వేయకూడదు. సుభాషితాలు కూడా అదే అంటూన్నాయి. సాధుపురుషులు, మాహత్ముల జోలికి వెళ్ళి, వారిని ఇబ్బంది పెట్టి, దూరంగా పారిపోయి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. సాధుపరుషులు చేతులు చాలా పెద్దగా ఉంటాయి. ఎంతదూరం పారిపోయిన వారి చేతుల నుండి తప్పించుకోలేరు అంటున్నాయి. అటువంటిది ఈ 60,000 మంది అనవసరంగా ఆయనను నిందించడమే కాదు చేతులలో గునపాలు, నాగళ్ళు ధరించి కపిల మహర్షి మీద దాడి చేయడానికి ఆయన మీదకు దూసుకెళ్ళారు.  

ఇంకా చదవండి »

గంగావతరణం(2)



భృగుమహర్షి వద్దకు వెళ్ళి ఎవరికి వశోద్ధారకుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది మహోత్సాహవంతులు జన్మిస్తారో అడుగగా, వారికి ఎవరు జన్మించాలో వారినే కోరుకోమన్నారు భృగువు. 

కేశిని ధర్మం తెలిసినది. కన్నవారిని వదులుకుని, ఇంటి పేరును మార్చుకుని, భర్త వెంట నడిచి స్త్రీ ఎందుకు వస్తుంది అంటే భర్త వంశాన్ని నిలబెట్టాడానికే, తాను సంతానాన్ని కని, తన భర్త వంశాన్ని కొనసాగేలా చేయాడానికే అని ధర్మం చెప్తోంది. అంతేకాదు ఒక తండ్రి అదృష్టవంతుడని ఎప్పుడు అనిపించుకుంటాడంటే, తనకు మంచి సంతానం కలిగి, వారికి సంతానం కలిగి, ఆ సంతానానికి సంతానం కలిగి, వారందరిని తన కళ్ళతో చూసినప్పుడే. ధర్మం తెలిసినది కనుక తనకు వంశకరుడు జన్మించాలని కోరుకుంది. 

సుమతి తనకు 60,000 మంది మహోత్సాహవంతులు కలగాలని కోరుకుంది. ఎంత మంది పుడితే ఏం లాభం. ఒక్కడు పుట్టినా వాడు వంశం పేరు నిలబెట్టేవారు కావాలి, చరిత్రలో నిలిచిపోవాలి. 

మహాతపశ్శాలి, సత్యమే మాట్లాడేవాడు, వేదం అర్ధం సహితంగా తెలిసినవాడూ, వేదాన్ని నిరంతరం పఠించేవాడైన భృగుమహర్షి మాటలు నిజమైనాయి.కొంతకాలనికి వారు గర్భం ధరించారు, ప్రసవించారు. కేశినికి వంశకరుడైన కూమారుడు జన్మించాడు, అతనికి అసమంజసుడు అని నామకరణం చేశారు. సుమతికి ఒక మాంసపిండం నుండి 60,000 వేల మంది చిన్న చిన్న పిల్లలు పుట్టారు. వారు మరి చిన్నగా ఉండడం చేత నేతిభాండములలో పెట్టి వారిని పెంచారు. ఈనాడు మన చెబుతున్న test tube babies, ఇటువంటి గొప్ప శాస్త్రపరిజ్ఞానం త్రేతాయుగంలో, దాదాపు 12 లక్షల సంవత్సరముల క్రితమే మన హిందువులకు ఉంది. వారిని దాదులు(ఆయలు) పెంచి పెద్ద చేశారు. 

అసమంజసుడు, 60,000 మంది పిల్లలు పెరిగి పెద్దవారువుతున్నారు. 60,000 మంది బాగా ఉత్సాహవంతులయ్యారు. ప్రతి పనికి అత్యుత్సాహం చూపించేవారు. ఈ అసమంజసుడికి ఒక దురలవాటు ఉంది. రాజ్యంలో ఉన్న పిల్లలందరిని ఆడుకుందామన్న నెపంతో సరయు నది ఒడ్డుకు తీసుకువెళ్ళి, వారిని నదిలో ముంచి, వారి మీద నిలబడి తొక్కి, ఊపిరి ఆడకుండా చేసి, వారిని చంపి ఆనందించేవాడు. ప్రజలు చాలా కాలం పాటు సహనంతో ఉన్నా, కొంతకాలానికి వారికి సహనం నశించి, వెళ్ళి రాజైన సగరుడికి విన్నవించుకున్నారు.  

ప్రజలందరూ వెళ్ళి సగరుడికి అసమంజసుడి విషయం చెప్పారు. క్షత్రియుల ధర్మం తెలిసినవాడు కనుక, ప్రజలకు హాని చేసేవాడు తన కూమారుడైనా సరే అతనికి తగిన శిక్ష పడాలని అసమంజసుడికి రాజ్య బహిష్కారం విధించాడు సగరుడు.ఆనాడు లోకకంటకుడు కన్న కొడుకైనా శిక్షార్హుడే అని రాజులు నిరూపించారు. ఒక స్త్రీ మీద పైశాచికంగా అత్యాచారం చేసి, ఆమె చావుకు కారణమైనవారిని ఉరి తీస్తే తమను(వాళ్ళలో చాలామంది, వాళ్ళ పిల్లలూ అత్యాచారలు చేసినవాళ్ళే కనుక)కూడా ఉరి తీయవలసి వస్తుందని వాళ్ళను ఉరి తీయకుండా ఆపిన ఘనత ఈనాటి మన రాజకీయనాయకులది. 

వంశకరుడిని కోరుక్కునాడు కనుక ఈ అసమంజసుడికి ఒక కూమారుడున్నాడు. అతని పేరు అంశుమంతుడు. అతను సగరచక్రవర్తి దగ్గరే ఉండిపోయాడు. అసమంజసుడు అడవులకు వెళ్ళిపోయాడు. 

చాలా కాలం అయిపొయింది. సగర చక్రవర్తి ముసలివాడయ్యాడు. రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం ఆయన అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. యాగం/యజ్ఞం  ఎక్కడపడితే అక్కడ చేయకూడదు. దానికి శాస్త్రం కొన్ని ప్రదేశాలను చెప్పింది. యాగాలే కాడు ఏ పనైన సరే ఎక్కడ పడితే అక్కడ చేయాకూడదు. హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్య ఉన్న భూమి పరమపవితమైంది. దాన్ని ఆర్యవర్తం అంటారు. అది యజ్ఞభూమి కనుక అక్కడ సగరచక్రవర్తి యాగం చేయాడానికి నిర్ణయించుకున్నాడు. దీక్షపరుడై కూర్చున్నాడు, యాగం మొదలుపెట్టారు, యాగానికి సంబంధించిన అశ్వాన్ని(గుర్రాన్ని) విడిచిపెట్టారు. అది గడ్డిమేస్తూ అన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రదేశానికి చేరుకోవాలి. అప్పుడు యాగం పూర్తవుతుంది. చాలా కాలం గడిచిపొయింది. అశ్వం వెళ్ళింది కాని తిరిరాలేదు. 

తన సింహాసనానికి అపాయం వస్తుందన్న భయంతో ఇంద్రుడు ఆ గుఱ్ఱాన్ని తీసుకువెళ్ళి, పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ప్రక్కన విడిచిపెట్టాడు. 

ఇప్పుడు మనందరికి ఒక అనుమానం తప్పకుండా వస్తుంది. యాగం చేస్తే ఇంద్రుని పదవికి ముప్పెందుకు వస్తుందని. అందరు చెప్తారు ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి. స్వర్గంలో ఉంటాడాని. ఎక్కడ ఉంది ఆ లోకం అంటే ఎక్కడో లేదు.  మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఏ విధంగానైతే నీరు ఆవిరి రూపంలో ఉన్నా మనకు కనిపించదో అదే విధంగా ఎందరో దేవతలు, యోగులు, సిద్ధులు, మహర్షులు, యక్షకిన్నెరకింపురుషులు మన చుట్టూ ఉన్నా ప్రకృతిలోనూ, పర్యావరణంలోనూ, ఈ భూగోళమంతటా మానవనేత్రానికి కనిపించకుండా ఉన్నారు. అందుకే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని మన ధార్మిక గ్రంధాల్లోనే ఉంది.  

యజ్ఞం ప్రకృతిలో ఉన్న దేవతలను సంతృప్తి పరుస్తుంది. యజ్ఞం చేయడం వలన ప్రకృతిలో చాలా మార్పులు సంభవిస్తాయి. మండు ఎండాకాలంలో, మిట్టమధ్యాహ్నం వేళ, కరువు ప్రాంతంలో కూడా యజ్ఞంతో వర్షం కురిపించవచ్చు. ఇది నిరూపింపబడింది. మీకు నా మీద నమ్మకంలేకపోతే 2-9-1993 నాటి ఆంధ్రజ్యోతి,9-10-1994 ఈనాడు దినపత్రికలు చూడండి. అంటే ఇప్పుడేం జరుగుతోంది. సమస్త ప్రకృతికి అధిదేవత ఇంద్రుడు. అతని ఆజ్ఞానుసారమే వర్షాలు కురుస్తాయి, గాలులు వీస్తాయి. యజ్ఞం చేయడం వలన మనిషి ప్రకృతిలో తనకు కావలసినవి పొందగలుగుతున్నాడంటే అది ఇంద్రుని ఆధిపత్యానికి, సింహాసనానికి గండి కొట్టినట్లే కదా. 

అందుకే ఇంద్రుడు యాగాశ్వన్ని తీసుకుని వెళ్ళి తపస్సు చేస్తున్న కపిల మహర్షి వద్ద విడిచిపెట్టాడు. చాలా కాలం గడిచిపొయింది. అశ్వం వెళ్ళింది కాని తిరిగిరాలేదు. 

ఇంకా చదవండి »

గంగావతరణం

శ్రీ రామాయణంలో బాలకాండలో శ్రీ రాముడు తాటక సంహారం చేశాక విశ్వమిత్రుడు, రామలక్ష్మణులు శొణా నది తీరం వెంబడి వెళ్తుండగా రాముడు గంగా ఎలా అవతరించిందో చెప్పమని మహర్షిని వేడుకున్నాడు. రాముడికి విశ్వమిత్ర మహర్షి గంగ ఎలా అవతరించిందో సంక్షిప్తంగా చెప్పినా, రాముడు సంతృప్తి చెందక మళ్ళీమళ్ళీ అడిగాడు. తనకు గంగావతరణ ఘట్టం సవివరంగా చెప్పమని ప్రార్ధించాడు శ్రీ రామచంద్రుడు. గంగా ఎలా అవతరించింది, గంగకు "త్రిపధగ" అనే పేరు ఎలా వచ్చిందో చెప్పమని విశ్వామిత్రుడి పాదాలు పట్టుకుని వేడుకోగా, రాముడి ఆతృతకు, తెలుసుకోవాలన్నా తపనకు చలించిపోయిన విశ్వామిత్ర మహర్షి గంగావతరణం గురించి చెప్పారు. 

విశ్వమిత్ర మహర్షి దానిని రెండు భాగాలుగా రామాయణంలోని రెండు ప్రక్కప్రక్క సర్గలలో చెప్పారు. మొదటి భాగంలో స్కందోద్పత్తి(సుబ్రహ్మణ్య స్వామి జననం)లో కొంచం చెప్పారు. 

హిమవంతుడు(హిమాలయ పర్వతరాజు)కు మేరువు అనే పర్వతం యొక్క కూమార్తే అయిన 'మనోరమ ' భార్య. వారికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూమార్తె గంగా, రెండవ కూమార్తె ఉమ(పార్వతి).
ఉమ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సుచేసి ఆయన్ను వివాహం చేసుకుంది. దేవతకార్యముల కొరకు మాకు మీ పెద్ద కూతురు గంగా కావాలి అని దేవతలు అడుగగా, హిమవంతుడు అంగీకరించి పెద్ద కూమార్తె గంగను దేవతలతో దేవలోకానికి పంపించాడు. దేవతలే గంగను దేవలోకానికి తీసుకుని వేళ్ళారు. అందువల్ల దేవలోకంలో ప్రవహిస్తూండేది గంగ. ఆ సమయానికి భూమి మీద కాని, రసాతలంలో కాని గంగా ప్రవహించేది కాదు. అటువంటి సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

ఆ సమయంలో ఆయోధ్య నగరాన్ని సగరుడనే ఒక మహారాజు పరిపాలిస్తూండేవాడు.ఆయన పేరు సగరుడు అంటే విషాన్ని తన శరీరంలో కలిగి ఉన్న వాడని అర్ధం. ఆయన తండ్రి అసితుడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఆయన తన భార్యలతో కలిసి హిమాలయ పర్వతాలలో భృగు ప్రశ్రమణము అనే పర్వతం వద్ద తపస్సు చేయడానికి వెళ్ళిన సమయంలో ఆయన భార్యలిద్దరూ గర్భవతులయ్యారు. రెండవ భార్యకు పిల్లలు కలుగకూడదనే ఆలోచనతో మొదటి భార్య విషాన్ని పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న రెండవ భార్య భృగుమహర్షి వద్దకు వెళ్ళి తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని కాపాడమని వేడుకుంది. భృగుమహర్షి మహ తపశ్శక్తి సంపన్నుడు, త్రికాలవేది కనుక ఆయన జరిగినది మొత్తం తన యోగ దృష్టితో గ్రహించాడు. పుట్టేవాడు గొప్పవాడవుతాడని ఆశీర్వదించి, తన శరీరంలో విషం కలిగి పుడతాడు కనుక సగరుడవుతాడని చెప్పాడు. 

అటువంటి సగరుడికి ఇద్దరు భార్యలు. మొడటి భార్య పేరు కేశిని. ఆమె ధర్మం తెలిసినది, ధర్మాన్నే ఆచరించేటువంటి లక్షణం కలిగినది, పతివ్రత, మహాసాద్వి. రెండవ భార్య పేరు సుమతి. మంచి సౌందర్య రాశి.ఈమె గరుత్మంతుడి చెల్లెలు. మొదటి భార్యది అంతః సౌందర్యం, రెండవ భార్యది బాహ్య సౌందర్యం. 

ఇద్దరు భార్యలు ఉన్నప్పటికి సగర చక్రవర్తికి సంతానం కలుగలేదు. కొంతకాలం పాటు సగర చక్రవత్రి, ఆయన భార్యలు సంతోషంతో కాలం గడిపినా, కాలక్రమంలో వారికి సంతానం లేదన్న భాధ మొదలైంది. వంశం నిలబదన్న దుఖం కలిగింది. ఆ కాలంలో ఏదినా సమస్య వస్తే వెంటనే పెద్దలైనవారు, ఋషులు, గురువుల వద్దకు వెళ్ళేవారు. అందువల్ల సగర చక్రవర్తి బృగు ప్రశ్రమణానికి వెళ్ళి నూరు సంవత్సరముల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు ప్రీతి చెందిన భృగుమహర్షి సగర చక్రవర్తి వద్దకు వచ్చి, నీవు గొప్ప కీర్తిమంతుడవు అవుతావు, నీ ఇద్దరు భార్యలలో ఒకరికి వంశకరుడు ( వంశాన్ని నిలబెట్టేవాడు/వంశ వృద్ధిని చేసేవాడు ) అయిన కూమారుడు జన్మిస్తాడు. మరొక భార్యకు మహా ఉత్సాహవంతులైన 60,000 మంది కూమారులు జన్మిస్తారు అని ఆశీర్వదించాడు భృగు మహర్షి. 

ఎవరికి వంశకరుడు జన్మిస్తాడు, ఎవరికి 60,000 మంది కూమారులి జన్మిస్తారో చెప్పలేదు.రాణూలిద్దరికి కుతూహలం పెరిపోయింది. అది తట్టుకోలేక, ఎవరికి వంశకరుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది జన్మిస్తారో తెలుసుకోవడానికి భృగు మహర్షి వద్దకు వెళ్ళారు. 

ఇంకా చదవండి »

ఆరో శతాబ్దంనాటి అరుదైన రామాయణం



- వాల్మీకి రామాయణం తర్వాత రెండో పురాతన ప్రతి
- కోల్‌కతాలో కనుగొన్న పండితులు

ఆంధ్రజ్యోతి - కోల్‌కతా, డిసెంబరు 19 2015: ఆరో శతాబ్దం నాటి అరుదైన రామాయణ ప్రతి ఒకటి కోల్‌కతా సంస్కృత సాహిత్య పరిషత గ్రంథాలయంలో అనూహ్యంగా దొరికింది. చరిత్రకారులు చెబుతున్నదాని ప్రకారం.. క్రీ.పూ.4వ శతాబ్దం నాటి వాల్మీకి రామాయణం తర్వాత.. అత్యంత ప్రజాదరణ పొందిన రామాయణాల్లో తమిళ కవి కంబ 12వ శతాబ్దిలో రాసిందే రెండో అత్యంత పురాతన రామాయణ ప్రతి. కానీ, ఇప్పుడు లెక్కలు మారనున్నాయి. ఇక, తాజాగా లభ్యమైన ప్రతి విషయానికొస్తే సీతారాములను దేవతలుగా కంటే మానవులుగానే చిత్రీకరించినట్టు దీన్ని విశ్లేషించిన సాహిత్య పండితులు చెబుతున్నారు.

 అసలు ఈ ప్రతి బయటపడిన విధానమే అనూహ్యం. ఆరోశతాబ్దం నాటి వహ్ని (అగ్ని) పురాణం పూర్తి ప్రతి కోసం పండితులు ఆసియాటిక్‌ సొసైటీ లైబ్రరీలో అన్వేషించగా.. అక్కడ అసంపూర్తి ప్రతి మాత్రమే దొరికింది. దీంతో వారు జర్మన్‌ పండితుడు ఆఫ్రెక్ట్‌ రాసిన అంతర్జాతీయ కేటలాగును పరిశీలించి అలాంటి మరో రెండు ప్రతులు ఉన్నాయని గుర్తించారు. వాటిలో ఒకటి లండన్‌లోని ‘ఇండియా ఆఫీస్‌ లైబ్రరీ’లో ఉండగా.. రెండోది కోల్‌కతాలోని సంస్కృత సాహిత్య పరిషత గ్రంథాలయంలో ఉందని కనుగొన్నారు. ఆ మేరకు, పరిషత లైబ్రరీలోని పుస్తకాలన్నీ గాలించి వహ్నిపురాణం పూర్తి ప్రతిని పట్టుకోగలిగారు.

దాన్నిపరిశీలిస్తుండగా.. ఉన్నట్టుండి అగ్ని పురాణానికి సంబంధంలేని శ్లోకాలు, పాత్రలు కనిపించడం మొదలైంది. తొలుత ఆశ్చర్యపోయినా, తర్వాత నిశితంగా పరిశీలించేసరికి.. అది రామాయణం అని అర్థమైంది. అయితే, వాల్మీకిరామాయణంలో ఏడు కాండలు (బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర కాండలు) ఉండగా.. ఇందులో మొదటి, చివరి కాండలు లేవు. కేవలం ఐదు కాండలు మాత్రమే ఉన్నాయి. రావణ వధానంతరం సీతారాములు వనవాసం ముగించుకుని తిరిగి వచ్చాక, శ్రీరామ పట్టాభిషేకంతో ముగిసిపోయింది. ‘‘ఈ రామాయణంలో కల్యాణం సమయానికి సీతారాముల వయసు ఎంత.. రావణుడు సీతను ఏ రోజున ఎత్తుకెళ్లాడు.. లాంటి ఆసక్తికర వివరాలున్నాయి’’ అని మనబేందు బందోపాధ్యాయ అనే స్కాలర్‌ చెప్పారు

ఇంకా చదవండి »

శ్రీ రామ జననం-శ్రీ రామాయణం


విధంగా, మహాత్ముడైన దశరథ మహారాజు తల పెట్టిన అశ్వమేధమూ, పుత్రకామేష్టీ పూర్తికాగా, దేవతలు హావిర్భాగాలు స్వీకరించి వెళ్ళిపోయారు. దీక్షానియమాలు నెరవేర్చుకుని భార్యలతోనూ, భృత్యులతోనూ, చతురంగబలాలతోనూ, వాహనాలతోనూ, దశరథుడు అయోధ్యకు ప్రయణమైనాడు. రాజులందరూ దశరథుడు చేసిన సత్కారాలకు చాలా ఆనందించి మునిపుంగవుడైన వసిష్ఠుడు వద్ద సెలవు పొంది, తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిపోయిన తరువాత దశరథుడు బ్రాహ్మణులను ముందు ఉంచుకుని అయోధ్య ప్రవేశించాడు. ఋష్యశృంగుడున్నూ గొప్ప గొప్ప సత్కారాలు పొంది, ఆనందించి, శాంతను వెంటబెట్టుకుని రోమపాదునితో కూడా వెళ్ళిపోయాడు.

ఇలాగ, వారందరూ ఎవరి దారిని వారు వెళ్ళిపోయాక, దశరథుడు సంపూర్ణ మనోరథుడై పుత్రోత్పత్తి నిరీక్షించుకుంటూ వున్నాడు. ఉండగా ఉండగా చైత్రమాసంలో, నవమినాడు, పునర్వసు నక్షత్ర కర్కట లగ్నంలో, కౌసల్యాదేవి రాముణ్ణి కన్నది. సమయంలో ఐదు గ్రహాలు స్వోచ్చస్థానాలలో వున్నాయి. జగన్నాథుడూ, సర్వలోక పూజ్యుడూ, సర్వలక్షణ సంపన్నుడూ అయిన విష్ణుమూర్తి అర్థాంశమే అలాగ ఇక్ష్వాకు వంశవృద్ధికోసం పుట్టాడు. కైకకు భరతుడు పుట్టాడు. అతను సాక్షాత్తూ విష్ణుమూర్తిలో ఎనిమిదోభాగం. తరువాత సుమిత్రకి లక్ష్మణుడూ, శత్రుఘ్నుడూ పుట్టారు. వారు విష్ణుమూర్తిలో ముడు పరకలు. భరతుడు పుష్యమీ నక్షత్రయుక్త మీనలగ్నంలో పుట్టాడు. సూర్యోదయం అయిన తరువాత ఆశ్రేషా నక్షత్ర కర్కటక లగ్నంలోలక్షణ శత్రుఘ్నులు పుట్టారు. వారు పుట్టినప్పుడు గంధర్వులు పాడారు. అప్సరసలు నృత్యం చేశారు. దేవదుందుభులు మోగాయి. పుష్పవర్షం కురిసింది.

అప్పుడు అయోధ్యానగరంలో గొప్ప ఉత్సవం విరాజిల్లింది. దశరథుడు బ్రాహ్మణులకు అపారంగా ధనము, లెక్కలేనన్ని ఆవులూ యిచ్చాడు. పన్నెండో దినాన అతను కొడుకులకు నామకరణ మహోత్సవం చేశాడు. వసిష్ఠుడు కౌసల్య కొడుక్కి రాముడని, కైకెయి కొడుక్కి భరతుడనీ, సుమిత్ర పెద్దకొడుక్కి లక్ష్మణుడనీ, చిన్నకొడుక్కి శత్రుఘ్నుడనీ పేర్లు పెట్టాడు. దశరథుడు కొడుకులకు జాతకర్మ మొదలైనవన్నీ జరిపించాడు. ఆవేళకూడా బ్రాహ్మణులకు , పౌరులకూ భూరి సంతర్పణలు చేయించి, విశేషీంచి బ్రాహ్మణులకు అనేక రత్నరాసులు ఇచ్చాడు.

వారిలో జేష్ఠుడైన రాముడు తండ్రికి మిక్కిలి సంతోషం కలిగిస్తూ జనుల కందరికీ ప్రీతి పాత్రుడైనాడు. అన్నదమ్ములు నలుగురూ వేదవేత్తలైనారు, శూరులైనారు, అందరికీ ఆదరనీయులైనారు. సకల సుగుణాభిరాములైనారు. జ్ఞానవంతులున్నూ అయినారు. వారందరిలోనూ రాముడు పరాక్రముడూ, అందరికీ మిక్కిలి ఇష్టుడూ, చంద్రుడులాగ దర్శనీయుడూ అయినాడు. అన్ని విద్యలలోనూ ధనుర్విద్య అంటే అతనికి చాలా ఇష్టం. తల్లిదండ్రులను పూజించడంలో కూడా అతనికి శ్రద్ధాసక్తులెక్కువ.

చిన్నప్పటినుంచీ లక్ష్మణునకు రాముని యెడల చాలా స్నేహం కలిగింది. లక్ష్మీ వర్థనుడైన లక్ష్మణుడు అందరికీ ప్రియకరుడే; కాని రామునికి మిక్కిలి ప్రియుడు. దీనికి తగ్గట్టు అతను రామునికి బహిఃప్రాణమే. లక్ష్మణుడు దగ్గర లేకపోతే రాముడు అన్నం ముట్టడు. నిద్రపోడు. రాముడు గుర్రమెక్కి వేటకు బయలుదేరితే వెనుక లక్ష్మణుడుండవలసిందే.

ఇటు వీరీలా వుండగా, అటు లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుణ్ణి అనుసరించి ఉంటాడు. తన ప్రాణాలకంటేనూ భరతుణ్ణి ఎక్కువగా చూసుకుంటాడు. శత్రుఘ్నుడంటే భరతుడూ అక్షరాలా అలాగే ఉంటాడు. నలుగురు కొడుకులవల్లా దశరథుడు పరమ ప్రీతుడవుతూ వుంటాడు. వారు శిశువులుగా వున్నప్పుడే యింత సంతోషించిన దశరథుడు, వారు జ్ఞానవంతులై, సుగుణవంతులై, కీర్తివంతులై దీర్ఘదర్శులై సాటిలేకూండా ప్రకాశించడం చూసి మరీ సంతోషించాడు. వారు కూడా తల్లిదండ్రులు గారాబంగా చూసిన కొద్దీ మరీ శ్రద్ధాసక్తులతో వేదశాస్త్రాలు చదువుకుని, తల్లిదండ్రులను పూజించసాగారు.


కొడుకులు నలుగురూ ఇలాగ దినదినమూ వృద్ధినొందుతూ వుండడం చూసి దశరథుడు వారికి వివాహాలు చెయ్యదలచి తగిన కన్యలను వెదకసాగాడు. ఒకనాడు దశరథుడు మహాసభలో కూచుని విషయం మంత్రులతో కూడా ఆలోచిస్తు వుండగా, గాధికుమారుడైన విశ్వామిత్రుడు వచ్చాడు. రాజు అతనికి ఎదురుగా వెళ్ళి సభలోకి తీసుకుని వచ్చి ఉన్నతాసనం యిచ్చి, అర్ఝ్యపాద్యలున్నూ ఇచ్చి పూజించాడు. దశరథుడు విశ్వామిత్రుణ్ణి చూసి మహర్షీ మీరాక వలన మాకు అమృతం లభించినట్లయింది. నీ రాకకు కారణం యేమిటో, నువ్వు ఏమి కోరి దయచేసావో అది చెబితే నేను వెంటనే చేస్తాను. నీ కోరిక తీర్చడానికి నాకు గల సర్వస్వమూ వినియోగిస్తాను అని అన్నాడు. ఇది విని విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు.

ఇంకా చదవండి »

జటాయువు,సంపాతి - స్వామి కార్యం

 
గృధ్రాధిప గతి దాయక రాం!!
స్వామి కార్యం అనేసరికి ప్రతి ప్రాణి తన శక్తి మేర కృషి సల్పిన గాథలను అద్భుతంగా వర్ణించిన మహా కావ్యము శ్రీమద్రామాయణము. ఉడుత వారధి కోసం, సంపాతి లంకకు మార్గం కోసం, అతని సోదరుడు జటాయువు సీతమ్మ ఆనవాల కోసం, వానరసైన్యం రావణుని వధించి ధర్మస్థాపన కోసం....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవరాశులు ప్రభువుకు తోడ్పాటుగా నిలిచారు. అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి జటాయువు. దశరథుని మిత్రుడైన జటాయువు ఒక గ్రద్ద. వృద్ధాప్యంతో శరీరం సహకరించక పోయినా సీతను అపహరించుకుపోతున్న రావణుని ఎదిరించి కొనప్రాణమున్నంత వరకు పోరాడిన వీరుడు. సీతమ్మను వెదుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు అమ్మ జాడ తెలిపి రామకార్య సాఫల్యానికి తోడ్పడిన గొప్ప జీవి. జటాయువు, సంపాతి ఇద్దరు అన్నదమ్ములు.

సీతా రామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మొట్టమొదటి సారి పంచవటి సమీపంలో జటాయువు రాముని కలుస్తాడు. తాను దశరథుని మిత్రుడని తెలిపి సృష్టిలో జంతు జాతి విధంగా ఆవిర్భవించిందో విపులంగా తెలుపుతాడు. కర్దమ ప్రజాపతినుండి గరుత్మంతుడు (శ్రీమహావిష్ణువు యొక్క వాహనము), అరుణుడు (సూర్యుని రథసారథి) గ్రద్ద సంతతిగా ఎలా జన్మించారో వివరిస్తాడు. అదే వారసత్వానికి తాను, సంపాతి చెందినట్లు తెలుపుతాడు. అరుణుని సంతతే జటాయువు, సంపాతి. దశరథుని స్నేహానికి గౌరవంగా భీకరమైన దండకారణ్యములో సీత రక్షణకు తాను రామునికి తోడుగా ఉండగలనని పలుకుతాడు.

సీతాపహరణం తరువాత రావణుని చేతిలో రెక్కలు తెగి, రక్తసిక్తమై అసువులు బాయటానికి సిద్ధంగా ఉన్న జటాయువును చూసి రాముడు జటాయువే సీతను చంపి ఉంటాడని అనుమానించి అతనిని చంపబోతాడు. అప్పుడు జటాయువు తనకు రావణునికి మధ్య జరిగిన యుద్ధాన్ని వివరించి సీత జాడ తెలుపుతాడు. రావణుని చరిత్రను, అతని శక్తి పరాక్రమాలను, విధంగా సీతను అపహరించింది వివరించి రాముని చేతిలో ప్రాణాలు వదులుతాడు. తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరుని కొరకు రాముడు దుఃఖించి, అతనికి స్వయంగా ఉత్తరక్రియలు జరుపుతాడు. విధంగా జటాయువు ఉత్తమలోకాలను పొందుతాడు

                                                                 గృధ్రాధిప సంసేవిత రాం!!!
దక్షిణభాగాన చివరకు చేరుకున్న వానరమూకకు రావణుని మరియు లంక జాడను తెలిపిన వాడు సంపాతి.

సీతమ్మకోసం వెదకి వెదకి అలసిన వానరులు ప్రాయోపవేశానికి సిద్ధులై తమ మాటల మధ్యలో జటాయువు ప్రస్తావన తీసుకువస్తారు. అప్పుడు వారి మాటలను విన్న సంపాతి వింధ్యమహాపర్వతపు గుహనుండి బయటకు వచ్చి " వానరులారా! నేను రెక్కలు విరిగిన పక్షిని, శక్తి హీనుడను. నాకు చేతనైనంత  శ్రీరాముని కార్యానికై మాట సాయం చేయగలను. ప్రాణశక్తి క్షీణించినను శ్రీరాముని కార్యమునకు తోడ్పడుటయే నా ప్రథమ కర్తవ్యము.

చక్కని రూప సంపద కలిగి, వివిధ ఆభరణములు ధరించియున్న ఒక స్త్రీని దుర్మార్గుడైన రాక్షసుడు అపహరించుకొని పోవుచుండగా నేను చూసాను. స్త్రీ రామా! రామా! లక్ష్మణా! అని విలపిస్తుండెను. ఆమె తన ఆభరణములన్నీ తీసువేయుచుండెను. పదే పదే శ్రీరాముని నామము స్మరించుచున్నందున ఆమె సీతయే అని నేను అనుకొనుచున్నాను,

రాక్షసుడు లంకాధిపతియైన రావణుడు. ఇక్కడికి వంద యోజనముల దూరములో సముద్రము నడుమ ద్వీపములో విశ్వకర్మ లంకానగరమును నిర్మించెను. నగరము చాలా రమ్యమైనది. సీతాదేవి లంకానగరమున రావణుని అంతఃపురమున బంధింపబడియున్నదిదీనురాలైన సీతామాతను రాక్షస స్త్రీలు కాపలాకాస్తున్నారు. సముద్రము మీద నూరు యోజనముల దూరము ప్రయాణించిన పిమ్మట దాని దక్షిణ తీరమున గల లంకలో రావణుని చూడగలరు. కావున వానర వీరులారా! వెంటనే మీ పరాక్రమము చూపి సముద్రమును లంఘించుటకు త్వరపడండి. మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగి రాగలరు. నా దివ్యదృష్టితో చూసి పలుకుతున్న మాటలివి.

నేను, జటాయువు గరుత్మంతుని వంశము వారమే. కనుక ఇక్కడినుండే రావణుని, సీతను స్పష్టముగా చూచుచున్నాను. వానరులారా! మేము మా ఆహారబలము చేతను, సహజమైన దివ్య శక్తివలనను శతయోజనములే గాక అంతకన్నా దూరము కూడా అనుక్షణము చూడగలము. నా తమ్ముని చంపిన రావణుని పగ తీర్చుకోవాలి. మీరే కార్యానికి సమర్థులు" అని పలికి సీతమ్మ జాడ తెలుపుతాడు సంపాతి. విధంగా పక్షి సోదరులైన జటాయువు-సంపాతి రామకార్యానికి ఎంతో ఉపకరిస్తారు.

రామకార్యానికి వానరులు, పక్షి సోదరులు...ఇలా ఎన్నో రకాల జంతు సమూహం తోడ్పడి తమ జన్మకు సార్థకతను తెచ్చుకొని రాముని అనుగ్రహంతో మోక్షాన్ని పొందాయి. అంతటి మహత్తరమైనది రామకార్యము. మానవునిగా జన్మించి, తనతో పాటు జన్మించి తనతో నడచిన ప్రతి ప్రాణినీ అనుగ్రహించిన ధర్మమూర్తి రామచంద్రుడు.


శ్రీరామ జయరామ జయ జయ రామ!

ఇంకా చదవండి »